ఎన్నో క్రొత్త దారులు.....
1. దారులు ఎన్నో ఉన్నా తీరం ఒకటే అయినా.... మాయ పొగమంచు లాగ కప్పి ఉన్న చోటే నిలబెడుతున్నా... 2. భాషలు ఎన్నో ఉన్నా భావం ఒకటే అయినా.... బిడియం భయం రెండు తలుపులయి మాటలకి గొళ్ళం పెట్టినా.... 3. ప్రమాదములు ఎన్నో ఉన్నా ప్రమోదం ఒకటే అయినా... జరగనివి జరుగుతున్నట్టు ఇంద్రజాలం చేసినా.... 4. వెనకాడని వేటుకత్తులు ఎన్నో ఉన్నా వెన్నెల పంచే చిరునవ్వు ఒకటే అయినా.... తెగింపుకి తెగతెంపులకి మధ్య త్రెగిన గాలిపటమయి తిరిగినా..... నేను ఉన్న చోట నిలబడి పైన ఆకాశ కాన్వాసుపై మేఘాలకి పేర్లు పెడుతా..... నా మాటలకి తలుపులు వేసుకున్నా మౌనం తో మనసుని నిమరగలను కళ్ళతోనే పలకరించగలను..... ప్రమాదమని ప్రమోదమని వినమని కనమని ఎన్ని చెప్పినా హృదయం లోకి వెళ్ళనివ్వను ఆనందాన్ని కనుమరుగు అవ్వనివ్వను.... చివరికి నేలకి దిగినా ఎన్నో క్రొత్త దారులు నేను వేసుకోగలను ఇంకో క్రొత్త వేకువ కాగలను....