నీ కనులు కన్న ప్రతీ కల నాకు సొంతం

     ఎందుకో నాకు ప్రేమకధానేపధ్యంతో కూడిన ఒక వైవిధ్యమైన పుస్తకం చదవాలనిపించింది. ప్రేమకధలు తెరపైన చూసినప్పుడు మనం ఒక కోణంలోంచే చూస్తాం. అదే చదివినప్పుడు ప్రేమని 360 డిగ్రీస్ లో మన:ఫలకంపై ఒక దృశ్యకావ్యమై చెరగని ముద్రవేస్తుంది. మరి అలాంటి కధలు ఈమధ్య ఎక్కడవున్నాయి?? చాలావరకు ప్రేమముసుగులో ఒక ఆకర్షణని ఒక తెలిసీతెలియని వయసువల్ల ఏర్పడిన నరాలని ఉత్తేజపరిచే చౌకబారు సాహిత్యం స్వచ్చమైన ప్రేమని ఒక లైంగికచర్యగామాత్రమే చూపెడుతూ అపహాస్యం చేస్తోంది.

          ప్రేమకధలు అందరికీ ఉంటాయి అందులో కొన్ని నిజమవుతాయి కొన్ని అందమైన అబద్దలుగా మిగిలిపోతాయి కొన్ని భావుకత్వం తో గుబాళిస్తాయి కొన్ని మొగ్గలోనే ధైర్యం చాలక అంతరిస్తాయి. అన్ని ప్రేమకధలు గొప్పవికావు ప్రేమని ఎప్పుడైతే ఒక దృష్టికోణంలో మాత్రమే చూడటం మొదలుపెడతామో అప్పుడే ఆ ప్రేమకధ ముగింపు దశ చేరుకున్నట్టే. ఏది ప్రేమో ఏది ఆకర్షణో ఏది హేయమైన శారిరిక అవసరమో లేదా కేవలం ఒక ఏమోషనల్ డెపెండెన్సిఓ తెలుసుకోవడంలోనే చాల ఎదురుదెబ్బలు తింటాం.

         ఇన్ని ఇరుకుసందులమద్యకూడా మనం జీవితాంతం నిజమైన ప్రేమని పొందడానికి తిరిగి పంచడానికి కూడ మనం సహనంతో అన్వేషిస్తాం. కొందరు మాత్రమే సాధిస్తారు కొందరు మాత్రమే మనకి ఇంతే ప్రాప్తం అని ప్రాక్టికల్గా ఆలోచించి ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో బేరిజు వేసుకుని జీవితాన్ని హాయిగా సుఖజీవనం చేసుకుంటారు. కానీ చాలమంది తొందరపాతువల్ల అప్పటివరకు లేని "అహం" ఒక్కసారిగా లావలాగా పెల్లుబికి మల్లెపాదులాంటి సున్నితమైన బంధాలని తగలబెట్టుకుంటారు.

         బేసిక్ గా మనం ఎన్నో క్లిష్టతరమైనా భౌగోళిక, అంతరిక్ష, గణిత,భౌతిక, సామాజిక, వేదాంత శాస్త్రాలకి సంబంధించిన కొలమానాలు డెఫినిషన్లు కనుక్కున్న మనం ప్రేమకి సరైన నిర్వచనం దానికి తగ్గ కొలమానాలను మాత్రం సరైనవి ఇచ్చుకోలేకపోయాం (దయచేసి తాజ్ మహల్ ని ఉద్దేశించకండి అది కట్టించిన వ్యక్తి యొక్క బలానికీబలహీనతకీ గుర్తుమాత్రమే ప్రేమకి కాదు). ఇవ్వడంకూడా సాధ్యం కాదేమో???

        ఇప్పటివరకు ప్రేమకధలలో చాలావరకు మనం కధానాయికలని కేవలం ఒక గ్లామర్ డాల్ గ, ఒక వ్యక్తిత్వం ఒక హుందాతనం లేని వ్యక్తిగా, సమాజం పట్ల ఒక నిర్దుష్టమైన అభిప్రాయంలేనటువంటి ఒక పాత్రగానే పరిచయమయి, హీరో వీరత్వం ముందు క్రొవ్వత్తిలాగ కరిగిపోయి తర్వాత కనుమరుగైపోయేలాగ మాత్రమే మిగిలిపోయింది.

        ఇన్ని అవకతవకల మధ్య గంజాయి వనంలో తులసి మొక్కలాగా స్వచ్చమైన పసిపిల్ల లేత పాదం వంటి కధ మనకి ఎక్కడదొరుకుతుంది??. ఎవరు రాసారు?? అదిగో అక్కడికే వస్తున్నా :) అలాంటి చాలా కొద్దిమంది భారతదేశ  రచయతులలో ఒకడు మన "రవీంద్ర సింగ్" అతను వ్రాసిన పుస్తకం పేరే  " YOUR DREAMS ARE MINE NOW"  రచయిత ఇందులో కొన్ని సమాంతరమైన సంఘటనలని తీసుకుని తనదైన శైలిలో తనదైన సృజణాత్మకతతో ఢిల్లీ లాంటి మహానగరాలకి చదువుకోవడానికి వచ్చిన ఒక ఆణిముత్యంలాంటి అమ్మయి కధని కళ్ళకుకట్టినట్టు చూపించాడు. ఆ ఆణిముత్యం పేరే "రూపాలి" మనం చదువుతున్నంతసేపు మనం ఆ అమ్మాయి కళ్ళలోంచే చూస్తాం అక్కడ సృష్టించిన వాస్తవికతకు దగ్గరగా ఉన్న సమాజాన్నీ, వాతావరణాన్ని. తనకు తారసపడిన వ్యక్తులూ వాళ్ళ సరదా కాలక్షేపాలూ, తనకు పరిచయమైన అక్కడి రాజకీయ శక్తులు, తనముందే పశుశక్తిని పలుకుబడినీ అవకాశవాదాన్నీ నరనరాన ఎక్కించుకుని వైఙ్ఞానిక ముసుగు వేసుకుని తిరిగే జంతువులు, అలాంటి మృగాలని నమ్మి ఏమాత్రం ఆలోచించని గొర్రెదాటు మందలూ, అలాంటీ మృగాలను ప్రశ్నించి వాళ్ళని గుడ్డిగా అనుసరిస్తున్న గొర్రెలను చైతన్యపరిచే ఒక కుర్రాడూ. అలాంటి వాడి జీవితంలో ఒక అందమైన పేజీ లాగ నిలిచి తన ఆవేశానికి ఆలోచనలాగా తోడై నిలిచిన "రూపాలి" వ్యక్తిత్వం. ఇవన్నీ అన్నీ మనల్ని కట్టిపడేస్తాయి ప్రతి ఒక్కళ్ళకీ మనకి ఇలాంటి ఒక చెల్లీ, స్నెహితురాలు, ఒక ప్రేయసి ఉంటే వాడు ఎంత అదృష్టవంతుడో అనిపిస్తుంది. మరి అలాంటి అమ్మాయి కన్న కలలు కల్లలైపోయేలా చేసిన మృగాలు. తన కన్న ప్రతీ చిన్న కలా నిజం చేసి తనకి తోడుగా   నిలవాల్సిన కుర్రాడు, రూపాలి లేకపోయినప్పుడు తను పడిన వేదన ఇవన్నీ మనకి కళ్ళలో నీళ్ళు  చిప్పిల్లకమానదు. రూపాలి కన్న ప్రతీ కల తన సొంతం చేసుకుని రూపాలి కన్న ఒక అందమైన సమాజం కోసం తను ప్రయత్నం చేసే దిశ వరకూ మనలోని అంతర్వేదనకి గురిచేస్తుంది. మరి అతను నిజం చేసాడా?? ఏమో దానికి రచయిత ఎలా చేసాడో చెప్పలేదు. బహుశా "నిర్భయమైన" సమాజాన్ని సృష్టించడంలో ఆ కుర్రాడి బాధ్యత ఎంత ఉందో మనకి అంతకు మించి ఉందని అలా ముగింపు ఇచ్చాడేమో???  
             
          రూపాలి ప్రేమకధలోకూడా శృంగారం ఉంటుంది కాని అది దిగజారుడులాగా అనిపించదు ఒక మంచి రొమాంటిక్ ఫీల్ ఉంటుంది. ఎక్కడా శృతి మించదు. ప్రేమ అనే సంగీత సముద్రములో శృంగారం ఒక ఆల్చిప్పలో హుందాగా దాగిఉన్న ముత్యపు పగదమైన ఒక కమ్మని రాగం. అది ఎంత శృతిలో మీటాలో ఎంత లయబద్దంగా ఉండాలో దాన్ని అక్షరీకరించడం లో కొంతమంది చేయితిరిగిన రచయితలకే సాధ్యం. అటువంటి రచయితలలో రవీంద్ర సింగ్ ఖచ్చితంగా ఉంటాడు.
           
            చాలామంది నాలాంటి కుర్రాళ్ళు ఒక సంకుచితమైన దృష్టికోణంలో పడి ఒక రకమైన ఛాందసానికి కట్టుబానిసలై అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి అన్న ఒక ఛట్రం లో ఉన్నవాల్లు. రూపాలి లాంటి అమ్మయిని చదివినప్పుడు మనం ఎంత తప్పుగా ఆలోచిస్తున్నామో అర్ధమవుతుంది. నిజం!!

            ఈ కధ ప్రతివాళ్ళకీ నచ్చాలన్న నిబంధన లేదు. కాని నచ్చినవాళ్ళు నిజంగా కొంచెం సమాజం పట్ల కొద్ది అవగాహన ఉన్నవాళ్ళై ఉండి ఉంటారు. నచ్హని వాళ్ళదీ తప్పు లేదు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు గిరిగీసుకుని ఇలాగే ఉండాలి ఉంటుందీ అన్న సరిహద్దులు గీసుకున్నవాళ్ళు. ఆ సరిహద్దులు చెరిపి అమ్మాయిల పట్ల ఒక పాజిటివ్నెస్ తో చూడాలనిపిస్తుంది. అప్పుడు ఈ ప్రేమకధ ఒక పరమార్ధాన్ని చెప్తుంది.....❤❤☺

                             "విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు యెదలో దాచగలమా??? అని" :)  ❤☺



                                                                           

Comments

Post a Comment

Popular posts from this blog

ప్రకృతిలో ఒకడు

వందేమాతరం

బాపు - ఒక "చిత్ర" మాంత్రికుడు - ఒక "చరిత్ర"